YS Sharmila: కాంగ్రెస్‌తో కొలిక్కి రాని చర్చలు.. తెలంగాణలో ఒంటరిగా బరిలోకి షర్మిల!
- పాలేరు నుంచి బరిలోకి వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల!
- మొత్తం 119 స్థానాల నుంచి బరిలోకి
- త్వరలోనే నామినేషన్ల స్వీకరణ!
కాంగ్రెస్‌తో విలీనం చర్చలు బెడిసికొట్టడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తొలి నుంచీ చెబుతున్నట్టుగానే ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించాలని షర్మిల యోచిస్తున్నట్టు ఆ పార్టీ సన్నిహిత వర్గాల సమాచారం.
ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని షర్మిల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు అధిష్ఠానంతోనూ చర్చలు జరిపారు. ఆమె పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆమె సేవలను ఏపీలో వాడుకోవాలని సూచించారు.
ఇందుకు షర్మిల ససేమిరా అనడంతో చర్చలు కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగాలని, మొత్తం 119 స్థానాల్లోనూ అభ్యర్థులను పోటీకి దించాలని షర్మిల యోచిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నిర్ణయం కోసం మరో ఒకటి రెండ్రోజులు వేచి చూడాలని కూడా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాతే షర్మిల తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని కూడా కొన్ని వర్గాలు తెలిపాయి.