Ambati Rambabu: జైలుకెళ్లిన ఏ నాయకుడు బతికి బట్టకట్టలేదు.. చంద్రబాబు మళ్లీ గెలవడం అసాధ్యం: అంబటి రాంబాబు
- అధికారంలో ఉండగా తప్పులు చేసి జైలుకెళ్లిన సీఎంలు ఎందరో ఉన్నారన్న మంత్రి
- జైలు నుంచి వచ్చాక తిరిగి గెలవలేదని గుర్తు చేసిన అంబటి
- రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ
- వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలుస్తామని ధీమా
చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. జైలుకెళ్లి వచ్చిన ఏ నాయకుడూ తిరిగి అధికారంలోకి రాలేదని గుర్తు చేశారు. దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి జైలుకు వెళ్లారని, వచ్చాక తిరిగి బతికిబట్టకట్టేలేదని అన్నారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చి మునిగిపోయిన పడవను లేపుతామని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నకిరికల్లులో నిన్న నిర్వహించిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ బలహీనపడిందని పవన్.. సానుభూతి పెరిగిందని టీడీపీ చెప్పుకుంటున్నాయని మంత్రి అన్నారు. తనకు డబ్బు అవసరం లేదంటున్న పవన్ టీడీపీకి మద్దతు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన పవన్‌కు ఈసారి ఒక్కసీటు కూడా రాదని తేల్చి చెప్పారు. వైసీపీ మాత్రం మొత్తం 175 స్థానాల్లోనూ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.