Guinness Record: పేక ముక్కలతో గిన్నిస్ లోకెక్కిన కోల్ కతా కుర్రాడు.. వీడియో ఇదిగో!
- 11 అడుగుల ఎత్తైన మేడ కట్టి రికార్డుల్లోకి ఎక్కిన వైనం
- 41 రోజులు కష్టపడి పేక ముక్కలతో 4 భారీ మేడల తయారీ
- పేకతో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని గిన్నిస్ రికార్డు
పేక మేడలు కడుతున్నాడని ఎగతాళిగా మాట్లాడుతుంటాం కానీ నిండా పదిహేనేళ్లు లేని బాలుడు వాటితోనే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు. పేక ముక్కలతో అతిపెద్ద నిర్మాణం కట్టి రికార్డు సృష్టించాడు. ఏకంగా 11 అడుగులకు పైగా ఎత్తు, 16 అడుగులకు పైగా వెడల్పు, 40 అడుగుల పొడవైన నాలుగు నిర్మాణాలను ఈ పేక ముక్కలతోనే కట్టేశాడు. దాదాపుగా 41 గంటలకు పైగా కష్టపడి ఈ పని పూర్తిచేసినట్లు ఆ బాలుడు చెప్పాడు. దీంతో గతంలో బ్రయాన్ బెర్గ్ పేరుతో ఉన్న పేక మేడల రికార్డు చెరిగిపోయింది. బ్రయాన్ పేకముక్కలతో మూడు మకావూ హోటళ్ల ప్రతిరూపాలను సృష్టించి రికార్డులకెక్కాడు. వాటి పొడవు 34 అడుగుల 1 అంగుళం, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పు.
కోల్ కతాకు చెందిన ఈ బాలుడి పేరు అర్నవ్ డాగా.. స్థానిక స్కూలులో పదో తరగతి చదువుతున్నాడు. ఓవైపు స్కూలు పాఠాలు చదువుతూ, హోంవర్క్ చేసుకుంటూ ఇటు పేక ముక్కలతో బిల్డింగ్ లు కట్టడం చాలా కష్టమైందని ఆర్నవ్ చెప్పాడు. అయినప్పటికీ పట్టువదలకుండా అటు చదువును, ఇటు ఈ హ్యాబిట్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నట్లు వివరించాడు. చిన్నతనం నుంచి ఇలా పేక ముక్కలతో చిన్న చిన్న మేడలు కడుతూ ఉండేవాడినని చెప్పాడు. అయితే, కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఈ హాబీని సీరియస్ గా తీసుకున్నట్లు వివరించాడు. గతేడాది కూడా రికార్డు కోసం ప్రయత్నించి విఫలమయ్యానని ఆర్నవ్ వివరించాడు.