Ravindra Jadeja: స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీసి ఆసీస్ ను దెబ్బకొట్టిన జడేజా
- వరల్డ్ కప్ లో నేడు భారత్ వర్సెస్ ఆసీస్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు
- ఓ దశలో 2 వికెట్లకు 110 పరుగులతో పటిష్టంగా ఉన్న ఆసీస్
- 9 పరుగుల తేడాతో 3 వికెట్లు పడగొట్టిన జడేజా
వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓ దశలో 2 వికెట్లకు 110 పరుగులతో పటిష్టంగా ఉన్న ఆసీస్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది. కొద్ది వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. 119 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. దీనికంతటికీ కారణం టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజానే. జడేజా స్వల్ప వ్యవధిలో 3 కీలక వికెట్లు తీసి ఆసీస్ టాపార్డర్ ను దెబ్బకొట్టాడు.
తొలుత ఫామ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ (46)ను బౌల్డ్ చేసిన జడేజా... ఆ తర్వాత ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆసీస్ టాపార్డర్ ను తన స్పిన్ తో హడలెత్తించాడు. జడేజా ధాటికి లబుషేన్ (27), అలెక్స్ కేరీ (0) పెవిలియన్ చేరారు.
అంతకుముందు, ఓపెనర్ మిచెల్ మార్ష్ (0)ను బుమ్రా డకౌట్ చేయగా, 41 పరుగులు చేసిన మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తో వెనక్కి పంపాడు. ప్రస్తుతం ఆసీస్ 31 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 123 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ (6 బ్యాటింగ్), కామెరాన్ గ్రీన్ క్రీజులో ఉన్నారు.