KTR: కేసీఆర్ ది వందేళ్ల ముందు చూపు... హైదరాబాద్ నగరాభివృద్ధికి కారణం అదే: కేటీఆర్
- కేసీఆర్ వల్లే హైదరాబాద్ విశ్వనగరం అయిందన్న కేటీఆర్
- తమ ప్రభుత్వ సమగ్ర అభివృద్ధి వ్యూహం పనిచేస్తోందని వెల్లడి
- మున్ముందు హైదరాబాదులో మరింత అభివృద్ధి కనిపిస్తుందని స్పష్టీకరణ
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ సీఎం కేసీఆర్ వల్లే విశ్వనగరంగా రూపాంతరం చెందిందని తెలిపారు. కేసీఆర్ ది వందేళ్ల ముందు చూపు అని, ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు హైదరాబాద్ నగర గతిని మార్చివేశాయని వివరించారు.
మెట్రో రైలు, రహదారి వ్యవస్థలో మార్పులు, పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాల కల్పన, హరితహారం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే వాతావరణం వంటి అంశాలతో హైదరాబాద్ నగరం తెలంగాణ హృదయ స్పందనగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు.
గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కనిపిస్తోందని, గత తొమ్మిదేళ్లలో దేశంలో మరే నగరం ఇంత అభివృద్ధిని సాధించలేకపోయిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర అభివృద్ధి వ్యూహమే అందుకు కారణమని, మున్ముందు ఇంకా అభివృద్ధిని చూపిస్తామని స్పష్టం చేశారు. ఇదే మన తెలంగాణ... కేసీఆర్ మన నాయకుడు అంటూ కేటీఆర్ నినదించారు.