Shahrukh Khan: షారుక్ ఖాన్ కు Y+ కేటగిరీ భద్రత.. పవర్ ఫుల్ ఆయుధాలతో సెక్యూరిటీ!
- 'పఠాన్' సినిమా సమయంలో షారుక్ కు బెదిరింపులు
- 11 మంది సిబ్బందితో Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
- వీరిలో ఆరుగురు కమెండోలు
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం Y ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. షారుక్ కు ఇటివలి కాలంలో బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆయనకు భద్రతను పెంచింది. Y ప్లస్ సెక్యూరిటీ కింద షారుక్ కు 11 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. వీరిలో ఆరుగురు కమెండోలు కాగా, మిగిలిన నలుగురు రాష్ట్ర వీఐపీ సెక్యూరిటీ వింగ్ కు చెందినవారు.
'పఠాన్' సినిమా సమయంలో షారుక్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సెక్యూరిటీగా ఏర్పాటు చేసింది. దీనికి తోడు షారుక్ కు తన సొంత బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. అయితే, షారుక్ కు ఎలాంటి బెదిరింపులు వచ్చేయనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. తాజాగా షారుక్ భద్రతపై హై పవర్ కమిటీ సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేసింది. ఈ సూచనల నేపథ్యంలోనే ఆయన భద్రతను Y ప్లస్ కేటగిరీకి పెంచారు. షారుక్ భద్రతా సిబ్బంది ఎంపీ-5 మెషీన్ గన్స్, ఏకే 47 అస్సాల్ట్ రైఫిల్స్, గ్లోక్ పిస్టళ్లను కలిగి ఉంటారు. దీంతోపాటు... షారుక్ నివాసం చుట్టూ 24 గంటలూ పోలీసులు పహారాలో ఉంటారు.