Jagan: అక్టోబర్ 25 నుంచి బస్సుయాత్ర.. మార్చిలో ఎన్నికలు.. ఫిబ్రవరిలో మేనిఫెస్టో: సీఎం జగన్

Jagan announcements on elections manifesto and bus yatra
  • అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు
  • ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు బస్సు యాత్ర ఉంటుందని ప్రకటన
  • ప్రతి రోజు మూడు మీటింగ్ లు ఉంటాయన్న సీఎం
  • జనవరి 1న పెన్షన్లు పెంచుతామని వెల్లడి
  • తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని వ్యాఖ్య
మార్చిలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైసీపీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు బస్సు యాత్రను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు కొనసాగుతాయని చెప్పారు. ప్రతి రోజు మూడు మీటింగ్ లు ఉంటాయని తెలిపారు. బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఉంటారని చెప్పారు. 

ఇది కేవలం బస్సు యాత్ర మాత్రమే కాదని... సామాజిక న్యాయ యాత్ర అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేదవారికి జరిగిన మంచిని వివరించే యాత్ర అని చెప్పారు. ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం, సాధికారత గురించి బస్సు యాత్రలో ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజలకు మరింత మేలు చేయడానికి మళ్లీ జగనే రావాలని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. 

పెత్తందార్లపై గెలవాలంటే పేదలంతా ఒక్కటవ్వాలని జగన్ చెప్పారు. రాబోయే ఎన్నికలు పేదవారికి, పెత్తందార్లకు మధ్య జరగబోయే యుద్ధమని తెలిపారు. జనవరి 1 నుంచి పెన్షన్ ను పెంచుతున్నామని... ఇచ్చిన మాట ప్రకారం రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెంచిన పెన్షన్ అవ్వాతాతలు, వితంతువులకు వర్తిస్తుందని తెలిపారు. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు వైఎస్సార్ చేయూత ఉంటుందని... ఈ పథకం ద్వారా రూ. 19 వేల కోట్లను అందిస్తున్నామని చెప్పారు. జనవరి 20 నుంచి 30 దాకా వైఎస్సార్ ఆసరా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమాన్ని అందించామని చెప్పారు. ప్రజలతోనే వైసీపీ పొత్తు అని... గ్రామ స్థాయి నుంచి వైసీపీ శ్రేణులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని... పొత్తులపై ఆధారపడనని చెప్పారు.
Jagan
YSRCP
Elections
Bus Yatra
Manifesto

More Telugu News