YS Jagan: పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ సెటైర్లు, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
- పవన్ పార్టీ పెట్టి పదిహేనేళ్లైనా అభ్యర్థులు లేరని ఎద్దేవా
- గ్రామాల్లో జెండాలు మోసేందుకు కార్యకర్తలు లేరన్న జగన్
- పవన్ తన జీవితమంతా చంద్రబాబు భజన చేశారని విమర్శ
- తాను లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారన్న సీఎం
- చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా సున్నానే అని వ్యాఖ్య
- 87 శాతం మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న జగన్
- వైనాట్ 175తో ముందుకు సాగుదామన్న ముఖ్యమంత్రి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. పవర్ స్టార్ పార్టీ పెట్టి పదిహేనేళ్లవుతోందని, కానీ ఆయనకు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరన్నారు. ఆ పార్టీకి గ్రామాల్లో జెండా మోసే కార్యకర్తలు లేరన్నారు. పవన్ కల్యాణ్ తన జీవితమంతా చంద్రబాబు భజన చేశారని, టీడీపీ అధినేతను భుజాలపై మోయడానికే సమయం సరిపోతోందన్నారు. చంద్రబాబు, పవన్ ఆలోచనలు అన్నీ మోసాల పైనే అని మండిపడ్డారు. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి అని ఆరోపించారు. టీడీపీ అధినేత జైల్లో ఉన్నా, జనంలో ఉన్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఆయనను చూస్తే ఎవరికైనా గుర్తుకు వచ్చేవి మోసాలు, వంచనలు, అబద్దాలు, వెన్నుపోటు అన్నారు.
చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే ఈడీ, సీబీఐలు నోటీసులు ఇచ్చాయన్నారు. ఆయనపై తమకు కక్ష ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో సగం మంది పాత టీడీపీ వారే ఉన్నారు కదా? అన్నారు. ఆధారాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేయవద్దనడం ఏమిటన్నారు. అక్రమాలు చేసిన బాబును సమర్థించడం అంటే పేదలకు అన్యాయం చేసినట్లే అన్నారు. తాను లండన్‌లో ఉన్నప్పుడే అరెస్ట్ జరిగిందన్నారు. చంద్రబాబును సమర్థించడం అంటే పెత్తందారీ వ్యవస్థను సమర్థించడమే అన్నారు. పేదవాళ్లు ఏకం కావాలని, అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమన్నారు.
రెండు సున్నాలు కలిసి వచ్చినా, నాలుగు సున్నాలు కలిసి వచ్చినా ఫలితం సున్నానే అవుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇంకెవరు కలిసి వచ్చినా సున్నానే అవుతుందన్నారు. దోచుకోవడం, పంచుకోవడం, తినడం తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు.
డిసెంబర్ 11 నుంచి 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమం ఉంటుందని, జనవరి 15 వరకు సాగుతుందని జగన్ తెలిపారు. ఇది ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరమన్నారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఈ క్రీడా సంబరం అన్నారు. జనవరి 1 నుంచి ఆసరా పెన్షన్ రూ.3వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం పొదుపు సంఘాలను ఆదుకుందని, సున్నా వడ్డీకే రుణాలు అందించిందన్నారు. ఫిబ్రవరిలో మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్తామని, మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుతామన్నారు. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. తాను పొత్తుపై ఆధారపడనని, ఎన్నికల సంగ్రామంలో ప్రజలతోనే తన పొత్తు అన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నట్లు చెప్పారు. 87 శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కాబట్టి వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు.