Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
- సుప్రీంకోర్టులో ఈరోజు కొనసాగిన విచారణ
- విచారణను రేపటికి వాయిదా వేసిన ధర్మాసనం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈనాటి సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని కోర్టుకు సాల్వే తెలిపారు. ఈ విధంగా అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ సందర్భంగా, ఈ కేసులో మీ క్లయింట్ కు 17ఏ వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిస్తున్నాయని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. దీనికి సమాధానంగా... ధర్మాసనం పరిశీలన వాస్తవమేనని సాల్వే చెప్పారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందువల్లే... ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 17ఏ ప్రకారం దేనికైనా పోలీసులు అనుమతులు పొందాల్సిందేననని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ రేపు వాదనలు వినిపించనున్నారు.