KTR: రేపో మాపో పులి బయటకు వస్తుంది... కేసీఆర్ లెక్కలు తీస్తున్నారు: పరకాల సభలో కేటీఆర్
- పులి వచ్చాక నక్కలన్నీ తొర్రలకే పోతాయని ఎద్దేవా
- కాంగ్రెస్ 60 ఏళ్లు మనల్ని వేధించిందన్న కేటీఆర్
- వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనన్న కేటీఆర్
- బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమన్న మంత్రి
రేపో మాపో పులి బయటకు వస్తుందని, అది బయటకు వచ్చాక ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లీ తొర్రలకే పోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. పరకాలలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో రూ.200 పెన్షన్ ఇస్తే కేసీఆర్ దానిని పదిరెట్లు పెంచారన్నారు. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేవని, ఇప్పుడు 46 లక్షల మందికి వస్తున్నాయన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఎగిరెగిరి పడుతున్నాయన్నారు.
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఇవాళ ఎగిరెగిరి పడుతున్న, నీలుగుతున్న నక్కలు, మూలుగుతున్న తోడేళ్లు అంన్నీ మళ్లా తొర్రలకే పోతాయన్నారు. ఎన్నికల సమయంలో ఏమేం చేయాల్లన్న దానిపై కేసీఆర్ అన్ని లెక్కలు తీస్తున్నారన్నారు. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా బాధ్యతతో మాట్లాడుతామని, కానీ కాంగ్రెస్ వాళ్లకు బాధ్యత లేదన్నారు. నెత్తి వాళ్లది కాదు, కత్తీ వాళ్లది కాదు ఎటుపడితే అటు గీకుతాడని చురకలు అంటించారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, పీకేది లేదన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లు మనల్ని వేధించిందన్నారు. ఇవాళ వచ్చి ప్రశ్నలు వేస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు.
వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని, బీఆర్ఎస్కు భారీ విజయం ఖాయమన్నారు. మంచి చేసే బీఆర్ఎస్కు ప్రజలు హ్యాట్రిక్ విజయం అందిస్తారన్నారు. 2014లో తెలంగాణను నడిపించింది ఉద్యమ చైతన్యమని, 2018లో గెలిపించింది సంక్షేమ సంబరమని, 2023లో శాసించేది సమగ్ర ప్రగతి ప్రస్థానమన్నారు. సమరానికి ముందే కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిందని, బీజేపీ కాడి పడేసిందన్నారు. ఈసారి బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమన్నారు.