Telangana: తెలంగాణ ఎన్నికలు: అభ్యర్థులు, ఓటర్లకు సీఈవో కీలక సూచనలు

Model Code of Conduct comes into force in five poll bound states
  • ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించవచ్చునన్న ఎన్నికల అధికారి
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్న ఈసీ వికాస్ రాజ్
  • ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు, రవాణా సౌకర్యం ఉంటుందని వెల్లడి
  • బ్యాలెట్ పత్రాలలో పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు
  • ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1950 నెంబరుని సంప్రదించాలని సూచన
తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించవచ్చునని చెప్పారు. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయన్నారు.

అభ్యర్థుల విషయానికి వస్తే అఫిడవిట్లో అన్ని కాలమ్స్ తప్పకుండా నింపాలని, లేదంటే తిరస్కరణకు గురవుతుందన్నారు. నమూనా, మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి ఉండదన్నారు. ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 1950 ఫోన్ నెంబరుని సంప్రదించాలన్నారు.

బ్యాలెట్ పత్రాలపై పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయన్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నాయకుల ఫోటోలను తొలగించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల చివరి వరకు అంటే అక్టోబర్ 31 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అయితే చిరునామా మార్పు అంశాలు మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నగదు ఉంటే అందుకు సంబంధించి పూర్తి పత్రాలు, వివరాలు ఉండాలన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో ఉన్నామన్నారు.
Telangana
Telangana Assembly Election
State Election Commission

More Telugu News