Atchannaidu: జగన్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే టీడీపీ తీసుకువచ్చిన 120 పథకాలు ఎందుకు రద్దు చేశారు?: అచ్చెన్నాయుడు
- రాష్ట్రానికి మళ్లీ జగనే కావాలి అంటూ వైసీపీ ప్రచారం
- వైసీపీ నేతల ప్రచారాన్ని తిప్పికొట్టే యత్నం చేసిన అచ్చెన్న
- ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలకే జగన్ కావాలని విమర్శలు
- జగన్ కు, రాష్ట్ర ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మళ్లీ జగనే కావాలి అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. జగన్ కావాల్సింది ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలకేనని, పేదలకు కాదని అన్నారు.
పేదల పట్ల సీఎం జగన్ చూపిస్తున్నది కపట ప్రేమ అని మండిపడ్డారు. జగన్ కు నిజంగానే పేదలపై ప్రేమ ఉంటే, టీడీపీ తీసుకువచ్చిన 120 పథకాలు ఎందుకు రద్దు చేశారని అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్టకొట్టారు... సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు రద్దు చేశారు.... పెళ్లి కానుకలు ఇవ్వడంలేదు అని మండిపడ్డారు.
టీడీపీ నాడు సంక్షేమ పథకాల అమలుతో ప్రజలను సొంత కాళ్లపై నిలబడేలా చేస్తే, జగన్ వచ్చి పేదలను బిచ్చగాళ్లుగా మార్చేశారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లను ఎందుకు మళ్లించారని అచ్చెన్నాయుడు నిలదీశారు. పేదలను వదిలేసిన జగన్ కు, ఏపీ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు.