New Zealand: ఒక్క బంతికి 13 పరుగులా.. అసాధ్యమంటారా అయితే ఈ వీడియో చూడండి!
- నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో చెలరేగి ఆడిన సాంటర్న్
- చివరి బంతిని సిక్సర్ గా మలిచిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్
- నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ రూపంలో మరో చాన్స్
- మరోమారు సిక్సర్ బాది మొత్తం 13 పరుగులు పిండుకున్న వైనం
వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు విజయాలతో దూసుకుపోతోంది.. వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముందుంచింది. ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్.. 223 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా, ఈ మ్యాచ్ లో కివీస్ ఆల్ రౌండర్ సాంటర్న్ అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాట్ తో పాటు బంతితోనూ నెదర్లాండ్స్ ను ముప్పుతిప్పలు పెట్టాడు.
చివరి బంతికి రెండు సిక్సులు..
ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన నెదర్లాండ్స్ బౌలర్ బాస్ లీ డే.. లాస్ట్ బంతిని ఫుల్ టాస్ వేయడంతో సాంటర్న్ దానిని గ్యాలరీలోకి పంపించాడు. అంపైర్ దీనిని నో బాల్ గా ప్రకటించడంతో పాటు ఫ్రీ హిట్ ఇచ్చాడు. దీంతో మరో మారు సాంటర్న్ సిక్సర్ బాదాడు. దీంతో రెండు సిక్సులు, నో బాల్ పరుగు కలిపి చివరి బంతికి మొత్తం 13 పరుగులు వచ్చాయి. వరల్డ్ కప్ లో దాదాపు అసాధ్యమైన ఈ ఫీట్ ను సాంటర్న్ సాధించాడు. ఈ మ్యాచ్ లో 17 బంతుల్లో 36 పరుగులు చేసిన సాంటర్న్.. బౌలింగ్ లోనూ తన మ్యాజిక్ చూపించాడు. ఏకంగా 5 వికెట్లు తీసి నెదర్లాండ్స్ జట్టు నడ్డి విరిచాడు.