Reece Topley: బంగ్లాదేశ్ 'టాప్ లే'పిన ఇంగ్లండ్!
- ధర్మశాలలో ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్
- మొదట 50 ఓవర్లలో 9 వికెట్లకు 364 పరుగులు చేసిన ఇంగ్లండ్
- లక్ష్యఛేదనలో 227 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్
- 4 వికెట్లతో బంగ్లా టాపార్డార్ ను హడలెత్తించిన రీస్ టాప్ లే
ఇంగ్లండ్ లెఫ్టార్మ్ మీడియం పేసర్ రీస్ టాప్ లే నిప్పులు చెరిగే బౌలింగ్ కు బంగ్లాదేశ్ టాపార్డర్ కకావికలమైంది. ధర్మశాలలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 137 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుచేసింది.
365 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ను టాప్ లే హడలెత్తించాడు. తొలుత వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. మొదట ఓపెనర్ టాంజిద్ హుస్సేన్ (1)ను అవుట్ చేసిన టాప్ లే ఆ తర్వాతి బంతికే నజ్ముల్ హుస్సేన్ శాంటో (0)ను డకౌట్ చేశాడు. కాసేపటికే బంగ్లాదేశ్ సారథి షకిబ్ అల్ హసన్ (1) కూడా టాప్ లే బంతికి బలయ్యాడు. మరో ఎండ్ నుంచి క్రిస్ వోక్స్ కూడా రాణించడంతో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది.
49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టును ఓపెనర్ లిట్టన్ దాస్ (76), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (51) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ భాగస్వామ్యాన్ని వోక్స్ విడదీయగా, ప్రమాదకరంగా మారుతున్న ముష్ఫికర్ రహీమ్ ను టాప్ లే పెవిలియన్ చేర్చాడు.
బంగ్లాదేశ్ లోయరార్డర్ లో తౌహీద్ హృదయ్ (39) పోరాడినా సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో బంగ్లాదేశ్ ఒత్తిడికి గురైంది. చివరికి 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్ లే 4 వికెట్లు తీయగా, వోక్స్ 2, శామ్ కరన్ 1, మార్క్ ఉడ్ 1, అదిల్ రషీద్ 1, లియామ్ లివింగ్ స్టన్ 1 వికెట్ తీశారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 364 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలాన్ (140) సెంచరీ సాధించడం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది.