KTR: కేటీఆర్ ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఎన్నికల ప్రధాన అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు
- కాంగ్రెస్ నేతలు స్కాంలు చేసి బాగా సంపాదించారన్న కేటీఆర్
- కాంగ్రెస్ నేతలు ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు తమకే వేయాలని కేటీఆర్ పిలుపు
- కేటీఆర్ వ్యాఖ్యలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డబ్బు తీసుకుని ఓటేయాలంటూ కేటీఆర్ ప్రజలకు సూచిస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నేతలు స్కాంలు చేసి బాగానే సంపాదించారని, ఆ డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతారని, కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయాలని కేటీఆర్ ఇటీవల ఓ సభలో పిలుపునిచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని వేణుగోపాలస్వామి పేర్కొన్నారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ ను కోరారు. కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే, తాము కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.