Nita Ambani: ముంబయి వచ్చిన ఐఓసీ అధ్యక్షుడు... సంప్రదాయ రీతిలో హారతి పట్టి స్వాగతం పలికిన నీతా అంబానీ
- అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాలకు భారత్ ఆతిథ్యం
- ముంబయిలో అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబయిలో సమావేశాలు
- ముఖేశ్ అంబానీ నివాసానికి విచ్చేసిన ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ భారత్ విచ్చేశారు. ఐఓసీ 141వ సర్వ సభ్య సమావేశాలు ఈ ఏడాది భారత్ లోనే నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు ముంబయిలో అక్టోబరు 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి.
ఈ క్రమంలో నిన్న ముంబయి వచ్చిన థామస్ బాచ్ కు ఘనస్వాగతం లభించింది. బాచ్ ముంబయిలోని భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ ఆంటీలియా నివాసానికి వచ్చారు. అక్కడ ఆయనకు ముఖేశ్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ సంప్రదాయబద్ధంగా హారతి పట్టి స్వాగతం పలికారు. బాచ్ కు నుదుటన తిలకం దిద్దారు.
కాగా, భారత్ లో ఒలింపిక్స్ ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసే కార్యక్రమంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా పాఠశాలల విద్యార్థులతో మేటి అథ్లెట్ల సమావేశాలు ఉంటాయి. అథ్లెట్లు ఒలింపిక్ పోటీల విశిష్టతను విద్యార్థులకు వివరించి వారికి స్ఫూర్తి కలిగించే ప్రయత్నం చేస్తారు.