Chandrababu: చంద్రబాబు అరెస్ట్ పై 29వ రోజూ కొనసాగిన నిరసనలు... ఫొటోలు ఇవిగో!
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన దీక్షలు
- వివిధ రూపాల్లో టీడీపీ శ్రేణుల నిరసనలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరసనలు 29వ రోజూ కొనసాగాయి. రిలే నిరాహార దీక్షలతో పాటు సర్వమత ప్రార్థనలు, యూనిట్ స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కంచికచర్ల మండలంలో కోగంటి బాబు ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ఆధ్వర్యంలో మేకల బండ కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నేతృత్వంలో దొర్నిపాడు మండలం బురారెడ్డి పల్లిలోనూ రచ్చబండ కార్యక్రమం చేపట్టారు.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో భారీ 'సైకిల్ ర్యాలీ' నిర్వహించారు. కొత్తూరు నుంచి కొమ్మినేనివారిపాలెం వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. కొవ్వూరు నియోజకవర్గంలో జొన్నలగడ్డ సుబ్బారాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ శాసన సభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది.
నెల్లూరు రూరల్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ సదస్సు నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.