Daggubati Purandeswari: అమిత్ షాతో లోకేశ్ భేటీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందన
- రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను లోకేశ్ హోం మంత్రికి వివరించారన్న బీజేపీ అధ్యక్షురాలు
- బీజేపీని విమర్శించేవారు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్
- ఏపీ పరిస్థితులకు బీజేపీ కారణమైతే హోం మంత్రి లోకేశ్‌కు అపాయింట్మెంట్ ఇస్తారా? అని ప్రశ్న
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమావేశంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం, ఇతర కీలక నేతల కక్షసాధింపు రాజకీయాలపై లోకేశ్ హోం మంత్రికి వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలకు బీజేపీ కారణమంటున్న వారు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ పరిణామాల వెనక బీజేపీ ఉంటే అమిత్ షా లోకేశ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చి ఉండేవారా? అని ప్రశ్నించారు.
కాగా, హోం మంత్రితో సమావేశం సందర్భంగా తాను జగన్ కక్ష సాధింపు రాజకీయాల గురించి వివరించినట్టు లోకేశ్ మీడియాకు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాటు, తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. తమపై ఉన్న కేసుల గురించి హోం మంత్రి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను తాను పరిశీలిస్తున్నట్టు అమిత్ షా అన్నట్టు లోకేశ్ మీడియాకు తెలిపారు.