Anand Mahindra: ఆనంద్ మహీంద్రా నిర్వేదం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై పరోక్ష కామెంట్
- యుద్ధరంగంలో మార్పులపై ఏఐతో చేసిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- పోరాట సాధనాలు, లక్షణాల్లో మార్పు వచ్చిందని వ్యాఖ్య
- యుద్ధం నిరర్థకమన్న విషయాన్ని మాత్రం మనుషులు గుర్తించలేకపోతున్నారని విచారం
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సమకాలీన అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా తనదైన శైలిలో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. తాజాగా ఆయన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై పరోక్షంగా స్పందించారు. యుద్ధ రంగంలో మార్పులపై కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఓ యానిమేషన్‌ను ఆయన షేర్ చేశారు.
ఆదిమానవుడి కాలం నుంచి నేటి వరకూ యుద్ధం రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయో కళ్లకుకట్టినట్టు చూపించే వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. తొలుత చేతులు, కాళ్లతో తన్నుకునే మనుషులు, ఆ తరువాత కర్రలు, రాళ్లు, ఆపై కత్తులు, అనంతరం ఫిరంగులు, గన్నులు, యుద్ధ విమానాలు, ట్యాంకులు వినియోగించడాన్ని వీడియోలో చూడొచ్చు. యుద్ధ లక్షణాలు, సాంకేతిక మారి ఉండొచ్చు గానీ యుద్ధం ఎంత నిరర్థకమో మనుషులు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారంటూ విచారం వ్యక్తం చేశారు. దీంతో, ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.