Israel-Hamas War: హమాస్ దాడిలో 22 మంది అమెరికన్ల మృతి.. నేడు ఇజ్రాయెల్‌కు యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్
- ఆరో రోజుకు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
- పౌరులు సహా ఇరువైపులా 3 వేల మందికిపైగా మృతి
- వార్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం
- గాజాను చుట్టుముట్టి భూదాడికి సిద్ధమైన ఇజ్రాయెల్
- తమ పిల్లలను తలలపై కాల్చి చంపారని, యువతులపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారని నెతన్యాహు ఆవేదన
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇరువైపులా ఇప్పటి వరకు సామాన్య పౌరులు సహా 3 వేల మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ అధీనంలోని గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ యూనిటీ గవర్నమెంట్, వార్ క్యాబినెట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మరోవైపు, హమాస్ తీవ్రవాదుల దాడిలో 22 మంది అమెరికన్లు మరణించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సీనియర్ అధికారులతో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ నేడు సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో కొన్ని కీలక అప్‌డేట్స్
* గాజాపై ఇప్పటి వరకు వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. భూ దాడికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గాజాను పూర్తిగా మిలటరీతో దిగ్బంధం చేయాలని నిర్ణయించింది.
* గాజా సరిహద్దుకు పెద్ద ఎత్తున దళాలను, మిలటరీ సంపత్తిని తరలించింది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 3 లక్షల మందిని మోహరించింది.
* ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు, ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్‌తో కలిసి ఇజ్రాయెల్ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధం.. పెరుగుతున్న ఉద్రిక్తతలను ఇది పర్యవేక్షిస్తుంది.
* అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నేడు ఇజ్రాయెల్ చేరుకుంటారు. ఆ దేశ సీనియర్ అధికారులతో సమావేశమవుతారు. హమాస్ దాడుల బాధితులకు సంతాపం తెలుపుతారు. దాడులను తీవ్రంగా ఖండిస్తారు. ఇజ్రాయెల్ భద్రతను పెంపొందించే చర్యలపైనా చర్చిస్తారు. ఆ దేశానికి భేషరతు మద్దతు ప్రకటిస్తారు.
* హమాస్ దురాగతాలపై ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. పాలస్తీనా తీవ్రవాద గ్రూపులు తమ దేశంలో సైనికులను పొట్టనపెట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అమ్మాయిలు, అబ్బాయిల తలలపై కాల్చి చంపారని.. పురుషులు, మహిళలను సజీవ దహనం చేశారని, యువతులపై అత్యాచారాలకు పాల్పడ్డారని, సైనికుల తలలు నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
* హమాస్ ఉగ్రవాదులు చిన్నారుల తలలు నరికిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. ఈ విషయాన్ని వైట్‌హౌస్ కానీ, ఇతర సీనియర్ అధికారులు కానీ ధ్రువీకరించలేదు.
* హమాస్ దాడిలో 22 మంది అమెరికా పౌరులు మరణించినట్టు అమెరికా ధ్రువీకరించింది. అయితే, వారంతా ఎక్కడ? ఎలా మరణించారన్న దానిపై తాను స్పష్టత ఇవ్వలేనని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.
* గాజాపై జరుగుతున్న వైమానిక దాడుల్లో 51 మంది పాలస్తీనియన్లు మరణించారని, 281 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రి తెలిపారు. వీరితో కలుపుకొని గాజాలో ఇప్పటి వరకు 1,200 మంది మరణించినట్టు పేర్కొన్నారు.