Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
- స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై హైకోర్టులో వాదనలు
- కేసు దర్యాప్తు పూర్తయిందన్న చంద్రబాబు తరపు న్యాయవాది
- కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలన్న ప్రభుత్వం తరపు న్యాయవాది
- ఈ నెల 17కి తదుపరి విచారణను వాయిదా వేసిన హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈనాటి విచారణ సందర్భంగా ఈ కేసులో చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని... ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు ఏ37గా ఉన్నారని, ఇప్పటికే రెండు రోజుల సీఐడీ కస్టడీలో బాబు ఉన్నారని చెప్పారు. స్కిల్ కేసులో ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్, బెయిల్ పై ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందని, చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ కూడా 30 రోజులు దాటిపోయిందని చెప్పారు. చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలో సీఐడీ తరపు న్యాయవాది స్పందిస్తూ... ఈ అంశంపై తాము ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉందని, తాము కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 17లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.