Ashwini Vaishnaw: వందే సాధారణ్ రైలు ఇదే.. ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రి
- సిద్ధమవుతున్న నాన్ ఏసీ వందే భారత్ రైలు
- చెన్నై ఫ్యాక్టరీలో తయారీ.. ఇంజన్ ఫొటో ట్వీట్ చేసిన అశ్విని వైష్ణవ్
- డిసెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి రానున్న ట్రైన్
దేశంలోనే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సామాన్యుల కోసం వందే సాధారణ్ పేరుతో నాన్ ఏసీ రైళ్లను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపింది. ఈ రైలుకు సంబంధించిన వివరాలను గతంలోనే వెల్లడించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వందే సాధారణ్ రైలుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. వందే సాధారణ్ ట్రైన్ ను నాన్ ఏసీ పుష్ పుల్ ట్రైన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రైలుకు ముందు, వెనుక ఇంజన్లు ఉంటాయని, రైలు ఎక్కడి నుండైనా వేగంగా దూసుకుపోతుందని రైల్వే మంత్రి చెప్పారు.
ఈ వందే సాధారణ్ రైలు ఫస్ట్ లుక్ ఫొటోను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇది తయారవుతోంది. 22 కోచ్ లు, రెండు వైపులా లోకోమోటివ్ ఇంజన్లతో రైలు సిద్ధమైంది. ఈ ట్రైన్ లో 12 స్లీపర్ కోచ్ లు, 8 జనరల్ కోచ్ లు, 2 గార్డ్ కోచ్ లు ఉన్నాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులో ట్రాయల్ రన్ ప్రారంభించి, డిసెంబర్ నెలాఖరులోగా ఈ రైలును అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.