Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై రేపు తీర్పు!
- అగస్ట్ 14న అన్నమయ్య జిల్లాలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత
- చంద్రబాబు ఏ-1గా 179 టీడీపీ నేతలపై కేసులు
- ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు
- చంద్రబాబు ముందస్తు బెయిల్పై నేడు ముగిసిన వాదనలు
అంగళ్లు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో గురువారం విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్పై ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో అగస్ట్ 14న చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళ్తున్నప్పుడు వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ అంగళ్లు కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ క్రమంలో కొంతమందికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో, నేడు ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం రేపు తీర్పు వెలువరించనుంది.