YS Jagan: ఏపీలో 'జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం' మార్గదర్శకాలు.. అర్హులు ఎవరంటే..!
- ఈ స్కీమ్ మార్గదర్శకాల విడుదల
- సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి రూ.1 లక్ష, మెయిన్స్ ఉత్తీర్ణులైతే రూ.50వేల ఆర్థిక సాయం
- పథకం పొందేందుకు అర్హతలు విడుదల చేసిన ప్రభుత్వం
- ఏపీ వారై, ఆర్థికంగా వెనుకబడిన, ఈబీసీ వర్గాలకు పథకం వర్తింపు
- ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం మించకూడదు
ఆంధ్రప్రదేశ్లో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉత్తీర్ణులైనవారికి ఆర్థిక సాయం అందుతుంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ఆర్థిక సాయం అందుతుందన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం, సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణులైన వారికి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తారు. వీటిని స్టడీ మెటీరియల్, కోచింగ్ కోసం వెచ్చించాలని ప్రభుత్వం పేర్కొంది.
ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సివిల్స్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 40 మంది వరకు అర్హత సాధిస్తున్నారని, ఈ సంఖ్యను మరింతగా పెంచేందుకు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఈ పథకం లబ్ధి పొందడానికి దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ వారు అయి ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన, ఈబీసీ వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది. సివిల్స్ పరీక్ష ఎన్నిసార్లు రాసిన వారికైనా ఇది వర్తిస్తుంది. అలాగే ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వారి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు మించకూడదు. పది ఎకరాల మాగాణి భూమి లేదా 25 ఎకరాల వరకు టెర్రస్ భూమి మాత్రమే ఉండాలి. కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద కేంద్రం పెట్టిన ఇతర నిబంధనలు కూడా వర్తింపచేస్తారు. సివిల్స్ ఫలితాలు విడుదలైన 15 రోజుల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.