israel: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు... బంకర్లో తలదాచుకున్న భారతీయ జంట భయానక అనుభవం
- అక్టోబర్ 7న ఒక్కసారిగా బాంబుల మోత, అరుపులు వినిపించాయన్న భారత జంట
- వెంటనే ప్రభుత్వ షెల్టర్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు వెల్లడి
- అక్టోబర్ 12న భారత్‌కు రావాల్సి ఉన్నప్పటికీ ప్రయాణం ఆగిపోయిందన్న మహిళ
- అంతా శుభం జరగాలని దేవుడ్ని ప్రార్థించామన్న హమాస్ దాడి భారత బాధితులు
తమ దేశంపై వేలాది బాంబులతో విరుచుకుపడిన హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఉగ్రవాదులకు కేంద్రమైన గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే మొదట హమాస్ ఇజ్రాయెల్‌పై అప్రకటిత యుద్ధం ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ అతలాకుతలమైంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన ఓ భారతీయ జంట తమ చేదు అనుభవాన్ని ఫేస్ టైమ్ ద్వారా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో పంచుకుంది. 32 ఏళ్ల ఐఐటీయన్ మోహిత్, గర్భిణీతో ఉన్న అతని భార్య జైదీప్ కౌర్ హమాస్ బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి ఓ బంకర్లో దాక్కున్నారు.
అక్టోబర్ 7న ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయని మోహిత్ తెలిపారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు, అరుపులు వినిపించాయని, వెంటనే తాము సమీపంలోని ప్రభుత్వ షెల్టర్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిపారు. మోహిత్, జైదీప్ కౌర్‌కు 2020లో పెళ్లి కాగానే, ఇజ్రాయెల్ వెళ్ళారు. హమాస్ దాడి రోజున వరుసగా బాంబు దాడి శబ్దాలు, రాకెట్ లాంచర్ల శబ్దాలు వచ్చాయని, దీంతో తాము సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లామని, అక్కడ యాభై మంది ఉన్నారని చెప్పారు.
జైదీప్ కౌర్ గర్భవతి కావడంతో డెలివరీ కోసం అక్టోబర్ 12న భారత్‌కు రావాల్సి ఉందని, కానీ హమాస్ దాడి నేపథ్యంలో ఈ ప్రయాణం ఆగిపోయిందని చెప్పారు. ఇక ఏం జరుగుతుందో చూడాలని ఆవేదనగా చెప్పారు. అదృష్టవశాత్తూ తాము తలదాచుకున్న బంకర్లో వైఫై ఉందని, అందులో ఉండి భయానక దాడి వీడియోలు, వార్తలు చూశామన్నారు. జైదీప్ కౌర్ స్పందిస్తూ... అలాంటి భయానక వార్తలు చూడకుండా ఫోన్ లో వెబ్ సిరీస్ వంటి వాటిని చూడమని తన భర్త చెప్పాడన్నారు. కానీ ఏం జరుగుతుందనే ఆందోళన తనలో ఉందన్నారు.
అంతా శుభం జరగాలని తాము దేవుడ్ని ప్రార్థించామని, భారత్‌లోని మా కుటుంబాన్ని కలవాలని కోరుకున్నామన్నారు. దురదృష్టవశాత్తు వారితో ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా కలవలేమని, కేవలం ఫేస్ టైమ్ ఆప్షన్ మాత్రమే ఉందని తమ భయానక అనుభవాన్ని పంచుకున్నారు.