Global Hunger Index: దేశంలో ఆకలి కేకలంటూ అంతర్జాతీయ నివేదిక.. భారత్ గుస్సా!

India rejects global hunger index report says it does not reflect reality
  • గురువారం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విడుదల
  • జాబితాలోని 125 దేశాల్లో భారత్‌కు 111వ స్థానం
  • భారత్‌ కంటే మెరుగ్గా పాక్(102), బంగ్లాదేశ్(81), నేపాల్(69), శ్రీలంక(60)
  • గతేడాది 121 దేశాల్లో భారత్‌కు 107వ స్థానం
భారత్‌లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారంటూ తాజాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పేరిట విడుదలైన నివేదికను భారత్ ఖండించింది. ఇలాంటివి దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని మండిపడింది. ఈ సూచి వాస్తవాన్ని ప్రతిబింబించట్లేదని వ్యాఖ్యానించింది. గురువారం గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2023ను విడుదల చేశారు. మొత్తం 125 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్‌ చివరన 111వ స్థానంలో నిలిచింది. అంతేకాదు, గతేడాది 121 దేశాలతో కూడిన జాబితాలో భారత్‌కు 107వ ర్యాంకు దక్కింది. ప్రస్తుతం మన దేశంలో 28.7గా ఉన్న ఆకలి సూచి.. ప్రజలు తిండిలేక అలమటిస్తున్నారన్న విషయాన్ని సూచిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

ఈ నివేదిక ప్రకారం, భారత్‌లో చిన్నారులు పోషకాహార లోపంతో కూడా సతమతమవుతున్నారు. ఇది ఏకంగా 18.7 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. దేశంలో ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు 3.1 శాతంగా ఉంది. అలాగే 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో రక్తహీనత 58.1 శాతంగా ఉంది. 

మరోవైపు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో దాయాదిదేశం పాక్‌ 102వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ 81వ స్థానం, నేపాల్ 69వ స్థానం, శ్రీలంక 60వ స్థానంలో.. భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తేల్చింది.  

నివేదికను తోసిపుచ్చిన కేంద్రం
భారత్‌లో ఆకలి కేకలు నెలకొన్నాయన్న గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ కొలమానం భారత్‌కు అనువైనది కాదని పేర్కొంది. దేశంలోని వాస్తవ పరిస్థితులను ఇది ప్రతిబింబించడం లేదని తేల్చి చెప్పింది. ఈ సూచిక మదింపులో ఉపయోగించిన నాలుగు ప్రాతిపదికల్లో మూడు చిన్నారులకు సంబంధించినవని, కాబట్టి ఇది యావత్ దేశంలోని సగటు పరిస్థితులను ప్రతిబింబించలేదని వివరించింది.
Global Hunger Index
India

More Telugu News