YS Jagan: కోడికత్తి కేసు..హైకోర్టులో నేడు జగన్ పిటిషన్‌పై విచారణ
- తనపై దాడి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ గతంలో ఎన్ఐఏ కోర్టులో జగన్ పిటిషన్
- సీఎం అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు
- ఎన్ఐఏ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసిన జగన్
- పిటిషన్‌కు నెంబర్ కేటాయించే సమయంలో రిజిస్ట్రీ అభ్యంతరం
- ఈ అంశంపై నేడు విచారణ చేపట్టనున్న న్యాయమూర్తి
కోడికత్తితో దాడి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ తను వేసిన పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేయడాన్ని సవాలు చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌కు నంబర్ కేటాయించే సమయంలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాస్ రెడ్డి నేడు విచారణ చేపట్టనున్నారు.
కాగా, కోడికత్తితో తనపై దాడి జరిగిన ఘటనలో కుట్ర కోణం ఉందని సీఎం జగన్ గతంలో ఎన్ఐఏ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. సాక్షుల విచారణకు షెడ్యూల్ ప్రకటించి, వాంగ్మూలాలు నమోదయ్యే దశలో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఎన్ఐఏ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్ నిర్వాహకుడు నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా పట్టించుకోకుండా విధుల్లోకి తీసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఎన్ఐఏ కోర్టు జులై 25న ఈ పిటిషన్ కొట్టేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.