Bandla Ganesh: పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు.. బండ్ల గణేష్ భావోద్వేగ స్పందన

Bandla Ganesh response on

  • పవన్ గురించి జగన్ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారన్న గణేశ్
  • పవన్ నిజాయతీపరుడు, భోళా మనిషి అని వ్యాఖ్య
  • జనం కోసం నిస్వార్థంగా కష్టపడుతున్నారని కితాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిన్నటి సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ మండిపడ్డారు. నిన్నటి నుంచి ఎంతో వేదనను అనుభవిస్తున్నానని... ఇప్పటికైనా మాట్లాడకపోతే తన బతుకుపై తనకే చిరాకు కలుగుతుందని ఆయన అన్నారు. తనకు దైవ సమానుడైన పవన్ గురించి సీఎం జగన్ నిన్న చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని అన్నారు. 

'సార్, మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి మీకు చెపుతా. దశాబ్దాల నుంచి ఆయనతో నేను తిరుగుతున్నా. పవన్ చాలా నిజాయతీ పరుడు. నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా ఆ కష్టాలు తనవని భావిస్తారు. భోళా మనిషి. 

జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అవి కూడా ఆయన ప్రమేయం లేకుండానే జరిగాయి. ఆయనకు సంబంధం లేని విషయం గురించి పదేపదే మీరు మాట్లాడటం పట్ల చాలా బాధ పడుతున్నా. పవన్ సమాజానికి ఉపయోగపడే మనిషి. స్వార్థం కోసం ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ హాయిగా ఉండండి సార్ అని నేను చెప్పేవాడిని. ఎందుకు మనం వెయ్యేళ్లు బతుకుతామా అని ఆయన అనేవారు. ప్రజలకు ఏదైనా చేయాలని ఎప్పుడూ అనేవారు. 

అన్నీ పక్కన పెట్టి జనం కోసం రాత్రింబవళ్లు నిస్వార్థంగా కష్టపడుతున్నారు. రాత్రింబవళ్లు షూటింగ్ లు చేసి సంపాదించిన డబ్బును జనసేన పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారు. ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీని నడుపుతున్న మహానుభావుడు ఆయన. నేను కష్టాల్లో ఉన్నా అని ఎవరు చెప్పినా వారికి పవన్ సాయం చేస్తారు. కులాభిమానం ఆయనకు లేదు. ఆయనకు కుల పిచ్చి ఉంటే నన్ను నిర్మాతను చేసేవారా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. పవన్ వంటి మహానుభావుడు, మంచి మనసున్న వ్యక్తిపై అభాండాలు వేయకండని చేతులెత్తి మొక్కుతున్నా. నేను జనసేన వ్యక్తిని కాదు. ఆ పార్టీ కార్యకర్తను కాను. పవన్ కల్యాణ్ అభిమానిని, ఆయన నిర్మాతని, ఆయన మనిషిని' అంటూ బండ్ల గణేశ్ భావోద్వేగంతో స్పందించారు.

  • Loading...

More Telugu News