Roja: పుట్టింటికి వచ్చిన అనుభూతి కలిగింది: ఏపీ మంత్రి రోజా

AP Minister Roja attends IIFF in Bengaluru

  • బెంగళూరులో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
  • హాజరైన మంత్రి రోజా
  • విజేతలకు అవార్డులు అందించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వెల్లడి
  • తన దృష్టిలో సినిమా అంటేనే పండుగ అని వ్యాఖ్యలు

ఏపీ టూరిజం, పర్యాటక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి రోజా బెంగళూరులో ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఐఎఫ్ఎఫ్) కు హాజరయ్యారు. దీనిపై రోజా సోషల్ మీడియాలో స్పందించారు. 

తన దృష్టిలో సినిమా అంటేనే పండుగ అని అభివర్ణించారు. ఈ సినిమా పండుగలో  పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. బెంగళూరులో ఐఐఎఫ్ఎఫ్ కు అతిథిగా హాజరై ఫిల్మ్ ఫెస్టివల్ లో గెలుపొందిన విజేతలకు తన చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఎంతోమంది యువ దర్శకులు, కళాకారుల సృజనాత్మకతను చూస్తుంటే ముచ్చటేసిందని రోజా పేర్కొన్నారు. 

సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం వంటిదని, సమాజం నుంచి స్ఫూర్తి పొందడం ద్వారానే దర్శకులు కథలను తయారుచేసుకుంటారని వివరించారు. ప్రపంచ సినిమాతో పాటు తెలుగు సినిమాలు కూడా అవార్డులు అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని రోజా తెలిపారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లోకి అడుగుపెట్టగానే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలిగిందని వెల్లడించారు. 

ఎన్టీఆర్, విశ్వనాథ్ వంటి మహనీయుల సినిమాలను మననం చేసుకోవడం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేకత అని వివరించారు. ఎన్టీఆర్ గారు అన్నట్టు... నాకు కూడా రాజకీయం-సినిమా రెండు కళ్లు వంటివి అనిపిస్తోంది అని రోజా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News