Operation Ajay: భారత్‌కు చేరుకున్న ‘ఆపరేషన్ అజయ్’ 2వ విమానం
- 235 మంది ప్రయాణికులతో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న విమానం
- కేంద్ర ప్రభుత్వానికి ఎన్నారైల ధన్యవాదాలు
- ఆదివారం కూడా కొనసాగనున్న ఆపరేషన్ అజయ్
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు ఉదయం మరో విమానం 235 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకుంది. భారత ప్రభుత్వం సొంత ఖర్చులతో ఈ చార్టెడ్ విమానాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం తొలి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో 212 మంది సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. ఈ విమానాల్లో భారత్ రావాలనుకునే వారు ముందుగా తన పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికే ప్రయాణం కల్పించేలా భారత్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఈ ఫ్లైట్స్ నిర్వహిస్తోంది.
కాగా, ఆదివారం కూడా ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. తమను సురక్షితంగా తరలిస్తున్న భారత్‌కు ఎన్నారైలు ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో సుమారు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో అధికశాతం మంది కేర్‌గివర్స్‌గా, ఐటీ రంగ నిపుణులుగా ఉన్నారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటివరకూ 1300 మంది ఇజ్రాయెలీలు చనిపోగా మరో 1500 మంది హమాస్ మిలిటెంట్లు మృతి చెందారు.