YS Sharmila: కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారూ?: వైఎస్ షర్మిల
- ప్రవల్లిక ఆత్మహత్యపై షర్మిల ఆవేదన
- ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదని కేటీఆర్ పై మండిపాటు
- బిడ్డలను కోల్పోతున్న తల్లిదండ్రుల ఉసురు తగులుతుందని మండిపాటు
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు లేక ప్రవల్లిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడుతుంటే.. కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారూ? అని ప్రశ్నించారు. ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు? అని మండిపడ్డారు. ప్రవల్లికది ఆత్మహత్య కాదని.. మీ బీఆర్ఎస్ సర్కార్ చేసిన హత్య అని ఆరోపించారు.
నష్ట జాతకురాలు ప్రవల్లిక కాదని.. అన్ని అధికారాలున్నా నిరుద్యోగుల కోసం ఏం చేయలేని పాలకులు నష్ట జాతకులని షర్మిల అన్నారు. ఉద్యోగాలకు సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాలేదు... ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించడం చేతకాలేదు... ఏం చూసి మిమ్మల్ని మళ్లీ ఎన్నుకోవాలి? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసినందుకా.. నిరుద్యోగ భృతి అని దొంగ హామీ ఇచ్చినందుకా.. అంగట్లో సరుకుల్లా TSPSC పేపర్లు అమ్ముకున్నందుకా.. ఎందుకు మీకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. పేపర్ లీకులు, పరీక్షల వాయిదాలు, కేసులు, కోర్టులు.. మీ పాలనలో నిరుద్యోగుల దుస్థితి ఇదని అన్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగం లేక ప్రాణాలు తీసుకుంటున్న చెట్టంత బిడ్డని కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల ఉసురు మీకు, మీ సర్కార్ కు తగలక మానదని అన్నారు.