Rohit Sharma: రోహిత్‌కి ఎక్కడ బంతులు వేస్తారు?: హిట్ మ్యాన్ బ్యాటింగ్‌పై పాక్ మాజీల ఆందోళన

Pakistan former greats express concern on the way of Roht Sharma batting

  • ఆఫ్ఘనిస్థాన్ పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కితాబు
  • ఇలా బ్యాటింగ్ చేస్తే ఏ జట్టుకైనా ఒత్తిడేనని ఆందోళన
  • ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ అక్రమ్, మిస్బా కలవరం


వన్డే వరల్డ్ కప్-2023లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌ ను  చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. 273 పరుగుల లక్ష్యాన్ని మనోళ్లు ఉఫ్ అని ఊదేశారు. మరో 15 ఓవర్లు మిగిలుండగానే భారత్ విజయతీరాలకు చేరింది. 

ఈ విజయంలో కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ముఖ్యపాత్ర పోషించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.  కేవలం 84 బంతుల్లో 131 పరుగులు చేశాడంటే అతడి విధ్వంసం ఏ స్థాయిలో  కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. చెత్త బంతులను చూడముచ్చటగా బౌండరీలు తరలించాడు. మైదానం నలువైపులా సొగసైన షాట్లతో ఆఫ్ఘన్ బౌలర్లందరినీ చితకొట్టాడు. 

రోహిత్ శర్మ చేసిన ఈ అద్భుత బ్యాటింగే పాకిస్థాన్ మాజీలకు ఆందోళన కలిగిస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌‌లో రోహిత్ ఏవిధంగా చెలరేగుతాడేమోనని కలవరపడుతున్నారు. పాక్ మాజీ దిగ్గజాలు వసీం అక్రమ్, మిస్బావుల్ హక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ ఊచకోత నుంచి తప్పించుకోగలరా?

ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ అత్యద్భుతంగా, సునాయాసంగా బ్యాటింగ్ చేశాడని వసీం అక్రమ్ పొగిడాడు. సరైన షాట్లు ఆడాడని, ఎలాంటి రిస్క్ తీసుకోలేదని మెచ్చుకున్నాడు. ఇతర బ్యాటర్ల కంటే రోహిత్ ఎక్కువ సమయం ఆడగలడని అనిపించిందని అక్రమ్ తెలిపాడు. విరాట్ కోహ్లీ చక్కటి ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీతో జట్టు విజయంలో సహకారం అందించినప్పటికీ... రోహిత్ శర్మ భీకరమైన ఆటతీరుతో రెచ్చిపోయి ఆడాడని కొనియాడాడు. రోహిత్ ఊచకోత నుంచి తప్పించుకోవడం బౌలర్లు కష్టమేనని అక్రమ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఏ స్పోర్ట్స్’తో జరిగిన చర్చలో వసీం అక్రమ్ ఈ విధంగా స్పందించారు. 

ఇక మరో పాక్ మాజీ మిస్బావుల్ హక్ స్పందిస్తూ.. రోహిత్ శర్మ ఈ విధంగా బ్యాటింగ్ చేయడం చూశాక ఏ జట్టు పైనైనా చాలా ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. బౌలర్లు అతడికి ఇంకెక్కడ బంతులు చేయాలి? అని అన్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్న విధానం బౌలర్లకు గండంగా మారనుందని, అతడికి (రోహిత్‌కి) ఎక్కడ బంతులు వేయాలో తెలుసుకోవడం బౌలర్లు చాలా పెద్ద పని అని మిస్బావుల్ హక్ వ్యాఖ్యానించారు.

రోహిత్ దెబ్బకు రికార్డులు బద్దలు

కాగా ఆఫ్ఘనిస్తాన్‌పై మ్యాచ్‌లో ఏకంగా 84 బంతుల్లో 131 పరుగులతో భారీ సెంచరీ సాధించే క్రమంలో రోహిత్ శర్మ పలు రికార్డులను చెరిపివేశాడు. 7 సెంచరీలతో వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు 6 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్న దిగ్గజం సచిన్‌ను అతడు అధిగమించాడు.

అంతేకాదు వరల్డ్ కప్‌తో ఇండియా తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా రోహిత్ శర్మదే కావడం విశేషం. ఇదివరకు 72 బంతుల్లో కపిల్ దేవ్ శతకం బాదగా... ఆఫ్ఘన్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 63 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 

అంతేనా... సిక్సర్లతో చెలరేగిన రోహిత్ అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచారు. క్రిస్ గేల్ పేరిట ఉన్న 553 సిక్సర్ల రికార్డును టీమిండియా కెప్టెన్ చెరిపివేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News