Bonda Uma: చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల వెకిలి వ్యాఖ్యలను సభ్యసమాజం అసహ్యించుకుంటోంది: బొండా ఉమ

Bonda uma fires on Sajjala Ramakrishna Reddy
  • జైల్లో డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు
  • నిన్న వ్యంగ్యంగా స్పందించిన సజ్జల
  • అహంకారంతో మాట్లాడకు సజ్జలా అంటూ బొండా ఉమ ఫైర్
  • జైలు మాన్యువల్ తెలియని నువ్వు ప్రభుత్వ సలహాదారువా? అంటూ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్నట్టు వార్తలు రాగా, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యోక్తులు, చమత్కారాలతో స్పందించడం తెలిసిందే. 

అయితే, సజ్జల వ్యాఖ్యల పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారమదంతో, అహంకారంతో మాట్లాడకు సజ్జలా? అంటూ ఘాటుగా హెచ్చరించారు. చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల వెకిలి వ్యాఖ్యలను సభ్యసమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. సజ్జల బయట కనిపిస్తే ప్రజలు ఆయన ముఖాన ఉమ్మడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

జైలు మాన్యువల్ ప్రకారం హై ప్రొఫైల్ వ్యక్తి, కేవలం రిమాండ్ పై జైల్లో ఉన్న చంద్రబాబుకి కనీస సౌకర్యాలు, వైద్యసేవలు అందించాలని తెలియని నువ్వు ప్రభుత్వ సలహాదారువా? అంటూ నిలదీశారు. వైద్య సేవలు, కనీస సదుపాయాలు పొందడం చంద్రబాబు హక్కు... దాన్ని కాదనే అధికారం సజ్జలకు, జైలు అధికారులకు లేదని బొండా ఉమ స్పష్టం చేశారు. 

"చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన భార్య, కోడలికంటే తాడేపల్లి తబలా బృందానికి బాగా తెలుసా? జైల్లో ఉండి కుట్రలకు పాల్పడటం, రాజకీయాలు చేయడం సజ్జలకు జగన్ రెడ్డికే బాగా తెలుసు. కోడికత్తితో భుజంపై గీయించుకొని, అమాయక దళిత యువకుడిని జైల్లో పెట్టిన నీతిమాలిన చరిత్ర ఎవరిదో మర్చి పోయావా సజ్జలా? సొంత బాబాయ్ ని గొడ్డలిపోట్లకు బలిచేసి, గుండెపోటని నమ్మించేంత నేర్పరితనం చంద్రబాబుకి లేదు. సొంత తల్లీ, చెల్లిని అధికారం కోసం వాడుకొని రోడ్డున పడేసేంత చాకచక్యం జగన్ కు ఉన్నంత మా నాయకుడికి లేదు. 

మీడియాతో ఒకలా... కోర్టుల్లో ఇంకోలా... జనంలో మరోలా మాట్లాడటం సజ్జల, జగన్ రెడ్డికి అవినీతితో అబ్బిన విద్య" అంటూ బొండా ఉమ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

జైలు అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారు

మోస్ట్ హై ప్రొఫైల్ ఉన్న వీవీఐపీ అయిన చంద్రబాబు హెల్త్ బులెటిన్ ఎవరు పడితే వారు విడుదల చేయడం ఏమిటి? జైలు సిబ్బందికి ఆ అధికారం ఎక్కడిది? తాడేపల్లిలో కూర్చొని మాట్లాడే సజ్జల లాంటి లఫూట్ లకు చంద్రబాబుస్థాయి తెలియదు సరే... జైలు అధికారులకు కూడా తెలియదా? జగన్ రెడ్డి అండతో చంద్రబాబుని ఇబ్బందిపెట్టే జైలు అధికారులు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. జైలుని క్రీడామైదానంగా మార్చుకొని రాజభోగాలు అనుభవించిన జగన్ రెడ్డి, ఏ తప్పూ చేయకుండానే జైల్లో ఉన్న చంద్రబాబు ఒక్కటేనని అనుకోవడం సజ్జల అహంకారానికి నిదర్శనం.
 
చంద్రబాబును జైల్లో బాగా చూసుకుంటే బరువెందుకు తగ్గారు?

చంద్రబాబుకి పంపే ఇంటిభోజనం నేరుగా ఆయనవద్దకు వెళ్లదు... జైలు అధికారులు మొత్తం పరిశీలించాకే భోజనం లోపలికి పంపిస్తారు. భోజనంపై కూడా బుద్ధిలేకుండా సజ్జల మాట్లాడుతున్నాడంటే ఏమనాలి? చంద్రబాబుని జైల్లో బాగానే చూసుకుంటే ఆయన బరువు ఎందుకు తగ్గారో సజ్జల చెప్పాలి. 

బయట ఉన్నప్పడు చంద్రబాబు రోజూ బరువు చెక్ చేసుకునేవారు. ఆయన జైలుకెళ్లే రోజు ఎంత బరువున్నారో జైలు రికార్డుల్లో ఉంటుంది. జైలు అధికారులు ఇప్పుడు చంద్రబాబు 66 కిలోలు ఉన్నారంటున్నారు. కానీ చంద్రబాబు వాస్తవంగా 72 కిలోల బరువుంటారు. లోఫర్, లఫూట్ ఐడియాలు సజ్జలకు, జగన్ రెడ్డికే వస్తాయి. 
 
తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి

ప్రభుత్వ కక్షసాధింపులకు తోడు... జైలు అధికారులు చంద్రబాబుకి కనీస సౌకర్యాలు కూడా కల్పించనందునే ఆయన ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యంపై వెంటనే రాష్ట్ర గవర్నర్ స్పందించాలి. మాకు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఆరోగ్యంగా ఉండటం, క్షేమంగా బయటకు రావడమే ముఖ్యం. ఈ ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తే, అంతగా నష్టపోతుంది. చంద్రబాబుకి చిన్న అపకారం జరిగినా జగన్ రెడ్డే బాధ్యుడు” అని బొండా ఉమ స్పష్టంచేశారు.
Bonda Uma
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Jail
Health
TDP
YSRCP

More Telugu News