Rambaboo: నాకు రాంబాబు ఫోన్ నెంబర్ కావాలి: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra wants Asian Games bronze medal winner Rambaboo details

  • ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రస్థానం
  • హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించిన భారత బృందం
  • 35 కిలోమీటర్ల నడకలో కాంస్యం సాధించిన రాంబాబు
  • రాంబాబు ఓ దినసరి కూలీ... పట్టుదలతో భారత అథ్లెట్ గా ఎదిగిన వైనం
  • రాంబాబు కుటుంబానికి తోడ్పాటు అందించాలని ఆనంద్ మహీంద్రా ఆరాటం

ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో 35 కిలోమీటర్ల నడక అంశంలో వచ్చిన కాంస్య పతకం కూడా ఉంది. ఆ పతకాన్ని సాధించింది ఓ దినసరి కూలీ అంటే నమ్మలేరు. కానీ ఇది నిజం. 

ఆ కూలీ పేరు రాంబాబు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ... పల్లెటూరు నుంచి అథ్లెటిక్స్ రంగంలో జాతీయ స్థాయికి ఎదిగాడు. ఆసియా క్రీడల 35 కిమీ రేస్ వాక్ అంశంలో మూడో స్థానంలో నిలిచి భారత్ కు తనవంతుగా ఓ కాంస్యం అందించాడు. 

ఇప్పుడీ రాంబాబు కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆరా తీశారు. తనకు రాంబాబు ఫోన్ నెంబర్ కావాలంటూ సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. దినసరి కూలీ నుంచి ఆసియా క్రీడల పతక విజేత వరకు అతడి ప్రస్థానం అన్ స్టాపబుల్... అతడి ఆత్మస్థైర్యం అమోఘం, అతడి సంకల్పం అద్వితీయం అని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. 

అయితే, రాంబాబు వివరాలు తనకు లభ్యం కావడంలేదని, అతడి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలంటూ ది బెటర్ ఇండియా అనే సంస్థను కోరారు. రాంబాబు కుటుంబానికి తాను సాయపడాలనుకుంటున్నానని, అతడి కుటుంబానికి ట్రాక్టర్ గానీ, పికప్ ట్రక్ గానీ ఇచ్చి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలనుకుంటున్నానని ఆనంద్ మహీంద్రా వివరించారు. రెండింట్లో వారు ఏది కోరుకుంటే అది ఇస్తామని వెల్లడించారు.  

బెటర్ ఇండియా సంస్థ పోస్టు ద్వారా రాంబాబు కుటుంబ నేపథ్యం, అతడి పేదరికం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది.

ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్రా జిల్లా బవార్ ప్రాంతానికి చెందిన రాంబాబు నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఆరుగురు సంతానంలో ఒకడైన రాంబాబుకు కష్టాలు ఎలా ఉంటాయో బాల్యంలోనే తెలిసింది. దాంతో కుటుంబ పోషణ కోసం కూలీ బాట పట్టాడు. అయితే, 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల ప్రదర్శన అతడిలో స్ఫూర్తి నింపింది... అతడిని అథ్లెటిక్స్ బాట పట్టించింది. 

చైనాలోని హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో హేమాహేమీలు ఉన్నప్పటికీ, 35 కిలోమీటర్ల నడకలో కాంస్యం సాధించాడు. 23 ఏళ్ల రాంబాబు విద్యార్హతల విషయానికొస్తే బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సు పూర్తి చేశాడు. ఉపాధి కోసం వారణాసిలోని ఓ హోటల్లో వెయిటర్ గానూ పనిచేశాడు. ఓ కొరియర్ సంస్థలో ప్యాకింగ్ బాయ్ గానూ పనిచేశాడు.

  • Loading...

More Telugu News