Devineni Uma: చంద్రబాబు ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్... ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని ఉమ!
- ఒక సైకో కోసం తెలంగాణలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆవేదన
- కేసీఆర్ గతంలో చంద్రబాబు వద్ద మంత్రిగా పని చేశారని గుర్తు చేసిన దేవినేని ఉమ
- చంద్రబాబు అరెస్ట్ అక్రమమని అందరికీ అర్థమైందని వ్యాఖ్య
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్ ట్వీట్ తనను ఆవేదనకు గురి చేసిందని కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై దేవినేని ఉమ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
ఒక సైకో కోసం తెలంగాణలో పోలీసులు ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేసిన వారేనని, వివిధ దేశాల్లో చంద్రబాబు కోసం సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కానీ హైదరాబాద్‌లో అడ్డుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ప్రొఫెషనల్స్ వినూత్న కార్యక్రమం 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' చేస్తుంటే వారిని అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు.
బావ కళ్ళల్లో ఆనందం చూసిన మొద్దు శీనుకు ఏం గతి పట్టిందో చూశామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి గుణపాఠం చెబుతారన్నారు. జగన్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలంతా చంద్రబాబు వైపే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని అందరికీ అర్థమైందన్నారు.
సకల శాఖ మంత్రి మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒళ్లు బలిసి, కొవ్వెక్కి మాట్లాడుతున్నాడన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఎవరు బలుపుతో మాట్లాడినా అంతరంగం జగన్‌దే అన్నారు.