ISRO: చంద్రయాన్-3 టెక్నాలజీని అమెరికా అడిగింది: ఇస్రో చీఫ్ సోమనాథ్
- మాజీ రాష్ట్రపత్రి అబ్దుల్ కలాం జయంత్యుత్సవంలో పాల్గొన్న ఇస్రో చైర్మన్
- కలాంకు ఘన నివాళి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం
- చంద్రయాన్-3 పరికరాలు చూసి నాసా శాస్త్రవేత్తలు అబ్బురపడ్డట్టు వెల్లడి
- తక్కువ ఖర్చుతో ఇంతటి అత్యాధునిక పరికరాలు ఎలా చేశారని ప్రశ్నించారన్న ఎస్. సోమనాథ్
చంద్రయాన్-3 టెక్నాలజీ చూసి అబ్బురపడ్డ అమెరికా ఈ సాంకేతికతను ఇవ్వమని అడిగిందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలోని ఆయన స్మారక మందిరంలో ఆదివారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ఇస్రో చీఫ్ కలాంకు ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్.సోమనాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చంద్రయాన్-3 వ్యోమనౌకను రూపొందించిన తర్వాత అమెరికా నుంచి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ నిపుణులను ఇక్కడకు ఆహ్వానించాము. చంద్రయాన్-3 గురించి వివరించాం. చంద్రయాన్-3లో మనం ఉపయోగించిన పరికరాలను చూసిన నాసా నిపుణులు.. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉన్న పరికరాలను వాడారని కొనియాడారు. దీన్ని ఎలా రూపొందించారు? ఈ టెక్నాలజీని మీరు అమెరికాకు ఎందుకు అమ్మకూడదు? అని ప్రశ్నించారు’’ అని సోమనాథ్ తెలిపారు.
చెన్నైలోని అగ్నికుల్, హైదరాబాద్‌లోని స్కైరూట్ సంస్థలు రాకెట్లను నిర్మిస్తున్నాయని ఎస్. సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికతో భారత్‌ను శక్తిమంతం చేసే దిశగా రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.