Temperatures: ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగితే ఇండియాలో తీవ్ర పరిణామాలు
- ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం
- వడదెబ్బ, గుండెపోటు సహా పలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం
- 220 కోట్లమందిపై తీవ్ర ప్రభావం
కారణాలు ఏవైనా ఇటీవలి కాలంలో భూతాపం విపరీతంగా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ పర్యావరణవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో వార్నింగ్ వెల్లడైంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఉన్న దానికంటే మరో రెండు డిగ్రీలు పెరిగితే ఉత్తర భారతదేశం సహా తూర్పు పాకిస్థాన్ ప్రజలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నివేదిక హెచ్చరికలు జారీచేసింది.
ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరగడం వల్ల దాదాపు 220 కోట్ల మంది అత్యంత తీవ్రమైన వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల వడదెబ్బ, గుండెపోటుతోపాటు పలు అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు కనీసం ఒక్కడిగ్రీ పెరిగినా ప్రతి సంవత్సరం వందల కోట్ల మంది తీవ్రమైన వేడి, గాలిలో అధిక తేమతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించింది. అప్పుడు వారు తమ శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబరుచుకోలేని పరిస్థితి వస్తుందని పేర్కొంది.