Maoist: భుజాలపై మోసుకెళ్లి మావోయిస్టును కాపాడిన భద్రతా బలగాలు.. జార్ఖండ్ లో ఘటన
- ఎదురుకాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టు.. వదిలేసి వెళ్లిన సహచరులు
- బుల్లెట్ గాయాలతో పడున్న మావోయిస్టును చూసి ఆసుపత్రికి తరలించిన భద్రతా బలగాలు
- హెలికాఫ్టర్ లో రాంచీకి తరలించి ఆసుపత్రిలో చేర్చిన వైనం
మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం.. అడవుల్లో పరస్పరం ఎదురుపడినపుడు ఎన్ కౌంటర్ జరగడం, ఇరువైపులా ప్రాణనష్టం చోటుచేసుకోవడం కూడా సాధారణంగానే మారింది. ఎవరికి వారు ప్రాణ రక్షణ కోసం కాల్పులు జరుపుతుంటారు. మావోయిస్టులు ఎదురుపడితే అరెస్టు చేయాలని చూసే పోలీసులు.. తప్పించుకునేందుకు వారు కాల్పులు జరిపితే మట్టుబెట్టేందుకే ప్రయత్నిస్తారు. అలాంటిది తమ కాల్పుల్లో గాయపడిన ఓ మావోయిస్టును కాపాడేందుకు చాలా శ్రమ పడ్డారు. భుజాలపై ఎత్తుకుని ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఆపై హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ఓ మావోయిస్టును బతికించేందుకు తాపత్రయ పడ్డ భద్రతా బలగాలను అందరూ మెచ్చుకుంటున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్ఛిమ సింగ్ భమ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని హుస్పిపీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టును సహచరులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పారిపోయిన వారి కోసం వెతుకుతూ ముందుకెళ్లిన సెక్యూరిటీ సిబ్బందికి గాయపడ్డ మావోయిస్టు కనపడ్డాడు. దీంతో ఆ మావోయిస్టును కాపాడేందుకు వారు అతడిని భుజాలపై మోసుకెళ్లారు. హథీబురు క్యాంపునకు చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై హెలికాప్టర్ లో రాంచీకి తరలించి ఆసుపత్రిలో చేర్పించారు.