K Kavitha: ఎవరి మేనిఫెస్టో చిత్తు కాగితమో ప్రజలు తేల్చుతారు: కవిత

Kavitha reacts to Revanth Reddy criticism on BRS Manifesto
  • బీఆర్ఎస్ మేనిఫెస్టోను చిత్తు కాగితం అంటూ తీసిపారేసిన రేవంత్
  • కాంగ్రెస్ మేనిఫెస్టోను టిష్యూ పేపర్ తో పోల్చిన కవిత
  • కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిక్కులేదు అంటూ వ్యాఖ్యలు
  • బీఆర్ఎస్ ఉన్నతమైన హామీలను ఇస్తుందని కాంగ్రెస్ ఊహించలేకపోయిందన్న కవిత
సీఎం కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. అయితే, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్తు కాగితంతో పోల్చారు. ఒక్కటీ సొంత హామీ లేదని, తమ ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టారని ఆరోపించారు. 

రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను టిష్యూ పేపర్ తో పోల్చారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఎంతో ఉన్నతమైనవని, అలాంటి హామీలు ఇస్తామని కాంగ్రెస్ ఊహించలేకపోయిందని అన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఎవరి మేనిఫెస్టో చిత్తు కాగితమో ప్రజలు తేల్చుతారని కవిత స్పష్టం చేశారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చారని, అక్కడ ఇచ్చిన హామీలకు ఇప్పటివరకు దిక్కులేదని, అమలు చేయలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. గ్యారెంటీ లేని హామీలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేయలేరని, గ్యారెంటీ లేని హామీలను చూపిస్తూ ప్రమాణం చేయాలని సవాళ్లు చేయడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా, తెలంగాణను అభివృద్ధి పథంలో పరుగు తీయించేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉందని కవిత కితాబిచ్చారు. అన్ని అంశాలను సరి చూసుకుని, సాధ్యాసాధ్యాలపై మదింపు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోతో విపక్షాలకు దిమ్మదిరిగిపోయిందని అన్నారు.
K Kavitha
Revanth Reddy
BRS Manifesto
Congress
Telangana

More Telugu News