World Cup: వరల్డ్ కప్: లంకను కుప్పకూల్చిన ఆసీస్ బౌలర్లు
- వరల్డ్ కప్ లో నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్
- 4 వికెట్లు పడగొట్టిన జంపా... 2 కీలక వికెట్లు తీసిన కమిన్స్
భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక లక్నోలో మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులతో పటిష్టంగా ఉన్న శ్రీలంక... 84 పరుగుల తేడాతో 10 వికెట్లు చేజార్చుకుంది.
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 2 వికెట్లతో శ్రీలంక పతనానికి శ్రీకారం చుట్టగా, ఆడమ్ జంపా 4 వికెట్లతో హడలెత్తించాడు. మిచెల్ స్టార్క్ 2, మ్యాక్స్ వెల్ 1 వికెట్ తో తమ వంతు సహకారం అందించారు. లంక జట్టులో ఓపెనర్ కుశాల్ పెరీరా 78, మరో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 61 పరుగులు చేశారు. మిడిలార్డర్ లో చరిత్ అసలంక 25 పరుగులు చేయగా, మిగతా వాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
రెగ్యులర్ కెప్టెన్ దసున షనక గాయపడడంతో జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న కుశాల్ మెండిస్ (9) విఫలం కావడం లంక స్కోరుపై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించగా, మ్యాచ్ మళ్లీ మొదలైన తర్వాత లంక పతనం మరింత ఊపందుకుంది.