Gay Marriage: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై నేడే ‘సుప్రీం’ తీర్పు!
- పిటిషన్లపై గతంలో విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం
- మే 11న తీర్పు రిజర్వు చేసిన వైనం
- అంతకుముందు వరుసగా 10 రోజుల పాటు సాగిన వాదనలు
- ఈ పిటిషన్లపై అనుకూల తీర్పుతో వచ్చే పర్యవసానాలు ఎదుర్కోలేమన్న కేంద్రం
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై భారత సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై మే 11న తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
అంతకుమునుపు, సుప్రీం కోర్టులో వరుసగా పదిరోజుల పాటు వాదోపవాదాలు సాగాయి. ప్రధాన న్యాయమూర్తితో పాటూ ధర్మాసనంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ వాదనలు సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం ఈ దశలో సరైన నిర్ణయం కాజాలదని అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో రాబోయే పరిణామాలను అంచనా వేయడం, ఎదుర్కోవడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది.
ఈ అంశంపై కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపినట్టు కూడా కేంద్రం కోర్టులో వెల్లడించింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం ప్రభుత్వాలు స్వలింగ వివాహాల చట్టబద్ధతను వ్యతిరేకించాయని పేర్కొంది. మరోవైపు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మణిపూర్, సిక్కిం మాత్రం నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరాయని చెప్పింది.