Gurukul Teacher: చెన్నూరులో గురుకుల టీచర్ ఆత్మహత్య.. ఐదుగురు టీచర్లపై కేసు

Gurukul Teacher Committed Suicide In Chennur

  • తోటి ఉపాధ్యాయుల వేధింపులే కారణమని మెసేజ్
  • మెస్ కమిటీ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న టీచర్
  • కమిటీలో ఇతర సభ్యులు సహకరించలేదని ఆవేదన

విధి నిర్వహణలో ఒకరికొకరు అండగా నిలవాల్సిన తోటి ఉద్యోగులే వేధింపులకు పాల్పడడంతో గురుకుల ఉపాధ్యాయురాలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో మెస్ ఇన్ చార్జి బాధ్యతల విషయంలో అందరూ తననే నిందించడంతో ఆ టీచర్ మనస్తాపానికి గురైంది. స్కూలు నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న చెరువులో దూకింది. సోమవారం చెన్నూరు బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు..

చెన్నూరు గురుకుల పాఠశాలలో తిరుమలేశ్వరి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం డిప్యుటేషన్ పై కరీంనగర్ గురుకుల పాఠశాల నుంచి చెన్నూరుకు వచ్చారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన ఆమెకు భర్త సంపత్, పదకొండేళ్ల కూతురు ఉన్నారు. చెన్నూరు గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన 1275 మంది క్రీడాకారులతో పాటు మరో వంద మంది సిబ్బందికి భోజన ఏర్పాట్లు చూసే బాధ్యతలకు ఓ కమిటీ వేశారు. ఈ కమిటీకి తిరుమలేశ్వరి ఇన్ చార్జి కాగా మరో పది మంది సభ్యులు ఉన్నారు. నాలుగు రోజులుగా మెస్ బాధ్యతలు చూస్తున్న ఆమె.. కమిటీ సభ్యులు సహకరించట్లేదని తన దగ్గర వాపోయిందని సంపత్ చెప్పారు.

ఈ క్రమంలో సోమవారం టిఫిన్, భోజనం తయారు చేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో మిగతా టీచర్లు, సిబ్బంది అందరూ తిరుమలేశ్వరిని నిందించారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆమె స్కూలు నుంచి బయటకు వెళ్లిపోయారు. గురుకుల స్కూలు ప్రిన్సిపాల్ సహా ఐదుగురు సహచర ఉపాధ్యాయులు వేధించారంటూ తన సెల్ ఫోన్ లో వాయిస్ మెసేజ్ రికార్డు చేసి పెట్టి.. ఆమె చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె భర్త సంపత్ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుమలేశ్వరి డెడ్ బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

  • Loading...

More Telugu News