Harish Rao: ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు: హరీశ్ రావు
- దశాబ్దం క్రితం తెలంగాణలో కరవు తాండవించిందన్న హరీశ్ రావు
- ఇప్పుడు పది రాష్ట్రాలకు తెలంగాణ అన్నం పెడుతోందన్న మంత్రి
- వేసవికాలంలోనూ చెరువులు జలకళ సంతరించుకున్నాయన్న హరీశ్ రావు
ముఖ్యమంత్రి అయినప్పటికీ కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ... దశాబ్దం క్రితం తెలంగాణలో కరవు తాండవించిందని, కానీ ఇప్పుడు పది రాష్ట్రాలకు మన రాష్ట్రం అన్నం పెడుతోందన్నారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుబిడ్డ కాబట్టి కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారన్నారు.
రైతులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యం నింపారన్నారు. తెలంగాణలో వేసవికాలం కూడా వర్షాకాలం మాదిరి కనిపిస్తోందన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు జలకళతో కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో కరవు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించామన్నారు. సిద్దిపేట రైలు మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేశామన్నారు.