Raghu Rama Krishna Raju: చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని వైసీపీ భయపడుతోంది: రఘురామకృష్ణరాజు

RaghuramaKrishnaraju reveals why margadarshi case filed

  • దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తానని చెప్పిన జగన్ మాట తప్పారన్న రఘురామ
  • సీఎం ఎక్కడ ఉన్నా ప్రజల్ని కలవరు కాబట్టి పెద్దగా ఉపయోగం లేదని వ్యాఖ్య 
  • తలా తోక లేకుండా కేసులు మోపుతున్నారని విమర్శ 

దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట మార్చారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పాలనా కేంద్రం విషయంలో ఆయన మాట తప్పి, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. గతంలో దసరాకు వెళ్తామని చెప్పారని, ఇప్పుడు డిసెంబర్ అంటున్నారని విమర్శించారు. 

రుషికొండను తవ్వి రూ.500 కోట్లతో వివిధ భవనాలు కడుతున్నారని మండిపడ్డారు. పర్యాటకం కోసం నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోందని, అందుకే అయితే అంత పెద్ద నిర్మాణాలు ఎందుకో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి విశాఖకు మకాం మార్చినంత మాత్రాన సర్వీసు నిబంధనల ప్రకారం పాలనా అధిపతిగా ఉన్న ఇతర సీఎస్, ఇతర కార్యదర్శులు శాశ్వతంగా వెళ్లే అవకాశం ఉండదన్నారు. అయినా, సీఎం ఎక్కడ ఉన్నా ప్రజల్ని కలవరు కాబట్టి పెద్దగా ఉపయోగం లేదన్నారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు తప్పకుండా రిలీఫ్ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని అధికార వైసీపీ భయపడుతోందన్నారు. ఆ కారణంగానే హఠాత్తుగా మార్గదర్శి కేసును బయటకు తీసుకు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు కేసులో ఈ రోజు వాదనలు పూర్తవుతాయని, త్వరలో బయటకు వస్తారన్నారు. ఆయనను ఇన్ని రోజులు జైల్లో ఉంచడం బాధాకరమన్నారు.

ఏపీ అధికార పరిధిలో లేని అంశాలను తీసుకు వచ్చి మార్గదర్శి విషయంలో ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తలా తోక లేకుండా కేసులు మోపుతున్నారన్నారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేశాం సర్... అన్నట్లుగా జగన్ వద్దకు వచ్చి సెల్యూట్ చేసేలా కొందరు అధికారుల తీరు ఉందన్నారు.  

  • Loading...

More Telugu News