Citibank: కంపెనీ డబ్బుతో భార్యకు శాండ్విచ్ కొనిచ్చి ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి!
- బ్రిటన్‌లో వెలుగు చూసిన ఘటన
- భార్యతో కలిసి బిజినెస్ ట్రిప్‌పై వెళ్లిన సిటీబ్యాంక్ ఉద్యోగి
- అక్కడ తన భార్య ఆహారం ఖర్చులు కూడా కంపెనీ నుంచి వసూలు చేసే ప్రయత్నం
- విషయం తెలిసి ఉద్యోగం నుంచి తొలగించిన సిటీబ్యాంక్
- ఉద్యోగి కోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురు,
కంపెనీ డబ్బుతో భార్యకు శాండ్విచ్ కొని ఉద్యోగం పోగొట్టుకున్న ఓ వ్యక్తికి తాజాగా కోర్టులోనూ చుక్కెదురైంది. అతడిని తొలగించడం సబబేనంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బ్రిటన్‌లో ఈ ఘటన జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, లండన్‌కు చెందిన ఫెకెటీ అనే వ్యక్తి గత ఏడేళ్లుగా సిటీ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. గతేడాది ఆయన విధుల్లో భాగంగా ఆమ్‌స్టర్‌డ్యామ్ వెళ్లాడు. ఫెకెటీ వెంట ఆయన భార్య కూడా వెళ్లింది. లండన్‌కు తిరిగొచ్చాక ఆయన పర్యటన ఖర్చుల రీఎంబర్స్‌మెంట్ కోసం కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. అమస్టర్‌డ్యామ్‌లో ఉండగా తిండి ఖర్చుల బిల్లులు కంపెనీకి సమర్పించాడు. తాను రెండు శాండ్విచ్‌లు, రెండు పాస్తాలు, రెండు కాఫీలు తీసుకున్నట్టు పేర్కొన్నాడు.
‘‘ఇదంతా నువ్వే తిన్నావా?’’ అంటూ సూపర్‌వైజర్ మరోమారు ఈ-మెయిల్ ద్వారా అడిగాడు. దీంతో, ఫెకెటీ ఆ రోజు తాను ఉదయం అల్పాహారం తీసుకోని విషయాన్ని చెబుతూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. తాను ఆ రోజు ఆర్డరిచ్చిన ఆహారంలో కొంత హోటల్‌కు తెచ్చుకుని తిన్నానని చెప్పుకొచ్చాడు. కానీ, చివర్లో.. తన భార్యకూ కొంత ఇచ్చానని అంగీకరించాడు. కేవలం 100 యూరోల ఖర్చుకు ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించాడు. కానీ సిటీ బ్యాంక్ అతడిని ఊహించని విధంగా విధుల నుంచి తొలగించింది.
ఇది అన్యాయమంటూ ఫెకెటీ కోర్టును ఆశ్రయించారు. బ్యాంకు మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. బిజినెస్ ట్రిప్‌ల సందర్భంగా ఉద్యోగుల భాగస్వాముల ఖర్చులను కంపెనీ భరించదని స్పష్టం చేసింది. ఇక్కడ ఎంత మొత్తం ఖర్చైందన్నది అప్రస్తుతమని తేల్చి చెప్పింది. ఇక న్యాయమూర్తి కూడా సిటీబ్యాంకు వాదనను సమర్థించారు. ఫెకెటీ మొదట్లో అసత్యాలు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తాను వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, సూపర్‌వైజర్ ఈ-మెయిల్స్‌కు బదులిచ్చిన సమయంలో తనపై ఆ మందుల ప్రభావం తీవ్రంగా ఉందని ఫెకెటీ వాదించినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కాగా, కోర్టు నిర్ణయంపై సిటీ బ్యాంకు ప్రతినిధి హర్షం వ్యక్తం చేశారు.