Jharkhand: అత్తవారింట్లో వేధింపులు.. మేళతాళాలతో కూతురును తెచ్చేసుకున్న తండ్రి..!
- ఝార్ఖండ్ లోని రాంచీలో ఘటన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
- అల్లుడు వేధిస్తుండడంతో చూడలేకపోయానన్న తండ్రి
- విడాకుల కోసం కూతురితో కోర్టులో కేసు వేయించినట్లు వెల్లడి
మంచి సంబంధం చూసి కూతురుకు పెళ్లి చేసి పంపడమే కాదు.. అత్తవారింట్లో కూతురు ఇబ్బంది పడుతుంటే అండగా నిలవాలని, అవసరమైతే పుట్టింటికి సాదరంగా ఆహ్వానించాలని ఓ తండ్రి చాటిచెప్పాడు. అల్లుడి వేధింపులతో బాధపడుతున్న కూతురును మేళతాళాలతో, టపాసులు పేలుస్తూ పుట్టింటికి తెచ్చేసుకున్నాడు. ఝార్ఖండ్ లోని రాంచీలో ఈ నెల 15న చోటుచేసుకుందీ ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో లింక్
రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా ఏడాది క్రితం తన కూతురు సాక్షి గుప్తాను సచిన్ కుమార్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆరు నెలలు గడిచాయో లేదో కూతురు, అల్లుడు మధ్య విభేదాలు మొదలయ్యాయి. సచిన్ కు గతంలోనే వివాహం జరిగిందని, అయినా సర్దుకుపోవడానికే ప్రయత్నించానని సాక్షి చెప్పింది. ఏడాది గడిచినా భర్త వేధింపులు తగ్గకపోవడంతో ఇక కలిసి ఉండడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది.
కూతురు నిర్ణయాన్ని స్వాగతించిన ప్రేమ్ గుప్తా.. కిందటి ఆదివారం అల్లుడి ఇంటికి వెళ్లి కూతురును తెచ్చేసుకున్నాడు. బ్యాండ్ మేళాలతో టపాసులు పేలుస్తూ కూతురును పుట్టింటికి తీసుకొస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కూతురును అత్తవారింటికి పంపి తండ్రి తన బాధ్యత పూర్తయిందని అనుకోవడం సరికాదని, అత్తవారింట్లో కూతురు ఇబ్బందులు ఎదుర్కొంటే అండగా నిలవాలని చెప్పాడు. ప్రస్తుతం తన కూతురుకు విడాకులు ఇప్పించేందుకు కోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు.