Renu Desai: రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఇదే: రేణు దేశాయ్

Renu Desai reveals the reason behind cancelation of second marriage
  • కుటుంబ సభ్యుల సూచనతో రెండో పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పానన్న రేణు
  • అయితే అప్పుడు ఆద్య వయసు ఏడేళ్లేనని.. అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నానని వెల్లడి
  • రెండు, మూడేళ్ల తర్వాత పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానన్న రేణు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన కొడుకు అకీరా, కూతురు ఆద్యల బాధ్యతలపై ఆమె పూర్తిగా దృష్టి సారించారు. మరోవైపు కొంత కాలం క్రితం ఒక వ్యక్తితో ఆమె పెళ్లికి సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆ పెళ్లి జరగలేదు. నిశ్చితార్థం రద్దయినట్టు ఆమె తెలిపారు. 

రవితేజ తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'లో రేణు దేశాయ్ కూడా నటించారు. ఈ నెల 20న ఆ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ... ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు. 

పవన్ నుంచి తాను విడిపోయే సమయానికి అకీరా, ఆద్య చిన్న పిల్లలని రేణు తెలిపారు. రెండో పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు చెపుతుండేవారని వెల్లడించారు. కొంత కాలం తర్వాత రెండో పెళ్లికి అంగీకరించానని... నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిపారు. అప్పుడు ఆద్య వయసు ఏడేళ్లని... పెళ్లి చేసుకుంటే ఆయనతో పాటు ఆద్యకు కూడా సమయం కేటాయించాల్సి ఉంటుందని... అది చాలా కష్టమనిపించిందని చెప్పారు. అందుకే రెండో పెళ్లిని రద్దు చేసుకున్నానని తెలిపారు. 

ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే, ఆయనతో సుఖంగా ఉంటావు అనిపిస్తే పెళ్లి చేసుకోమని అకీరా తనకు చెపుతుంటాడని అన్నారు. మరో రెండు, మూడు ఏళ్ల తర్వాత రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
Renu Desai
Second Marriage
Tollywood
Akira Nandan

More Telugu News