Temba Bavuma: ఈ ఓటమిని మర్చిపోలేం.. బాధ పెడుతూనే ఉంటుంది: దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా
- జరిగిన దాన్ని మర్చిపోవడం కష్టమన్న దక్షిణాఫ్రికా సారథి
- ఫీల్డింగ్ లోనూ విఫలం చెందామంటూ అంగీకారం
- ఎక్స్ ట్రా ల రూపంలో 32 పరుగులు సమర్పించుకున్న వైనం
నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం పట్ల దక్షిణాఫ్రికా టీమ్ తెగ మదనపడుతోంది. ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 245 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో నెదర్లాండ్ జట్టు 38 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.
సరిగ్గా 11 నెలల వ్యవధిలో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికాకు ఇది రెండో ఓటమి కావడం గమనించాలి. గతేడాది నవంబర్ లో టీ20 ప్రపంచకప్ లోనూ దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించింది. మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా దీనిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘‘జరిగిన దాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదు. ఇది బాధపెడుతూనే ఉంటుంది. కానీ రేపు తిరిగి రావాలి. మళ్లీ మా ప్రయాణం ప్రారంభించాలి. నేటి భావోద్వేగాన్ని అధిగమించి, రేపు మళ్లీ తల ఎత్తుకు రావాలి’’ అని బవుమా పేర్కొన్నాడు.
టెంబా బవుమా తమ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఏమీ లేడు. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ లో ఎక్స్ ట్రాల రూపంలో దక్షిణాఫ్రికా బౌలర్లు 32 పరుగులను సమర్పించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీల్డింగ్ లోనూ వైఫల్యాలు కొట్టిచ్చినట్టు కనపడ్డాయి. దీంతో తమ పనితీరు విషయంలో బవుమా తీవ్ర నిరాశతో ఉన్నట్టు కనిపించింది. ‘‘ఎక్స్ ట్రాలను నియంత్రించుకోగలం. 30 ఎక్స్ ట్రాలు అంటే మరో ఐదు ఓవర్లు అదనంగా ఇచ్చినట్టే. ఇది బాధిస్తోంది’’ అని బవుమా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై గొప్పగా ఆడామంటూ, నిన్నటి ఫీల్డింగ్ ను పరిశీలిస్తే అదే ప్రమాణాలతో ఆడలేదని స్పష్టమవుతోందన్నాడు. ప్రమాణాల మేరకు తాము ఆడలేదని అంగీకరించాడు.