Rahul Gandhi: ఈసారి దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి: రాహుల్ గాంధీ

Rahul Gandhi speech in Mulugu rally

  • తెలంగాణలో ఎన్నికల కోలాహలం
  • ములుగులో కాంగ్రెస్ బహిరంగ సభ
  • హాజరైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా

ఇవాళ ములుగులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభకు జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, ఈసారి దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోవని, కానీ తాము అన్నింటికీ సిద్ధపడే తెలంగాణ ఇచ్చామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నాడు నష్టం జరుగుతుందన్న ఆలోచనే లేకుండా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలన్నదే నాడు తమ ఆలోచన అని వివరించారు. 

ఇక, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు కాలం చెల్లిందని అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినట్టు రాహుల్ విమర్శించారు. నిరుద్యోగ యువతను కేసీఆర్ వంచించారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ.1 లక్ష రుణ మాఫీ అన్నారని, అదైనా గుర్తుందా, లేదా? అంటూ నిలదీశారు. 

బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి చోటుచేసుకుందని రాహుల్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్లు జేబులో వేసుకున్నారని, ధరణి పోర్టల్ లోనూ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో  ఏం చెప్పామో అదే చేశామని, తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. రాజస్థాన్ లో ఉచిత వైద్యం, కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పామని, ఆ మేరకు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములు, అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News