Florida: కారులో దూసుకెళ్లి కాలువలో తేలిన యువకుడు.. ఫ్లోరిడాలో ఘటన.. వీడియో ఇదిగో!
- కేప్ కోరల్ సిటీలో ఓ రేసర్ కు ఎదురైన భయానక అనుభవం
- గంటకు 128 కి.మీ. స్పీడ్ తో వెళ్తుండగా అదుపుతప్పిన కారు
- అదే వేగంతో దూసుకెళ్లి కాలువలో పడ్డ మెర్సిడస్ బెంజ్
- స్థానికుల సాయంతో ఒడ్డుకు చేరిన డ్రైవర్
అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఒకటి కంట్రోల్ తప్పి కాలువలో పడింది. చుట్టుపక్కల వారి సాయంతో కారు డ్రైవర్ ఒడ్డుకు చేరాడు. ఇదంతా ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లిక్ ఓర్లాండో ప్రచురించిన కథనం ప్రకారం.. కేప్ కోరల్ సిటీలో ఓ యువకుడు తన మెర్సిడస్ బెంజ్ కారులో వేగంగా దూసుకెళుతున్నాడు. గంటకు 80 ఎంపీహెచ్ ( 128 కి.మీ) వేగంతో వెళుతుండగా ఓ టర్నింగ్ వద్ద కారు అదుపుతప్పింది. అదే వేగంతో ముందుకెళుతూ గుంతల్లో ఎగిరిపడింది.
అయినా ఆగకుండా వెళ్లి పక్కనే ఉన్న కాలువలో పడింది. కారులోకి నీళ్లు రావడంతో బయటపడేందుకు డ్రైవర్ విఫలయత్నం చేశాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఓ స్థానికుడు కాలువలోకి దూకి ఆ డ్రైవర్ ను కారులో నుంచి బయటకు లాగాడు. ఆపై ఇద్దరూ కలిసి ఒడ్డుకు చేరారు. కాసేపటికే కారు మొత్తం నీట మునిగింది. ఇదంతా ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన సదరు ఇంటి ఓనర్.. ఈ ప్రమాదం తనను భయపెట్టిందని కామెంట్ చేశాడు.